Thursday, August 7, 2008

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక?

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక ఏర్పడిందా? తాజా పరిస్థితులు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. చిన్న, మధ్యతరహా పత్రికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంఘం అందరి సమస్యలపై కాకుండా కొందరికే పరిమితమవుతోందని ఆరోపిస్తూ "ఎస్మా" ఆవిర్భవించింది. ఎడిటర్స్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ పేరుతో కార్య రంగంలోకి దిగిన చీలిక వర్గం తన తొలి ప్రయత్నంలోనే అందరి అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఎదురైన ఎల్.ఎ. ప్రకటనల సమస్యను పరిష్కరించేందుకు "ఎస్మా" చేసిన కృషి ఫలించి, తిరిగి పాత పద్ధతి అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సమాయాత్తమవుతోంది. జిల్లా యేతర ప్రాంతాల నుంచి ప్రచురితమవితున్న చిన్న, మధ్యతరహా పత్రికలకు ఎల్.ఎ. ప్రకటనలను నిలిపివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి, పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘం ప్రయత్నించని తరుణంలో "ఎస్మా" రంగంలోకి దిగి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో చర్చించి ఆయనతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ కు డి.ఒ. లెటర్ రాయించి సమస్య పరిష్కారానికి కృషిచేయడం కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘానికి నాయకత్వం వహిస్తున్న వారిలో కొంతమందికి నచ్చినట్టులేదు. అందుకే "ఎస్మా" ప్రయత్నాలను అడ్డుకునే సాహసం చేస్తున్నారు. "అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు" అన్న సామెతను ఈ పదవి పిచ్చి నాయకులు సార్ధకం చేస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికలకు సంధించి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంఘం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్యవర్గంలో ఉన్న నాయకుల పత్రికల వరకే చూసుకుంటుండడం విమర్శలకు దారిస్తోంది. ఈ స్వార్ధపూరిత నాయకత్వాన్ని వ్యతిరేకించాలని చాలా మందికి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ కూడా ఆ సాహసం చేయలేకపోయారు. బహుశా ఆ ధైర్యం తొలుత "ఎస్మా" నాయకులకే వచ్చిందేమో!
గతంలో విశాఖపట్నంలోని చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఆర్టీసీ బస్ పాసుల జారీ సందర్భంగా ఎదురైన సమస్యను కూడా ఈ చిన్న పత్రికల సంఘం పరిష్కరించలేక తన చేతకాని తనాన్ని ఒప్పుకోలేక జర్నలిస్టుల సంఘాల వైఫల్యం వల్లే ఈ సమస్య ఎదురైందని సెలవిచ్చింది. ఈ సమస్య ఇప్పటికీ అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇదే విధంగా ఇళ్ల స్థలాల సమస్య కూడా పెండింగ్ లో పడింది. ఇక విజయనగరంలో కూడా ప్రకటనల విషయంలో ఎదురైన సమస్యలను అక్కడి జర్నలిస్టులే పరిష్కరించుకున్నారు తప్ప ఏ సంఘమూ తలదూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘాల అవసరం చిన్న పత్రికలకు ఎంతవరకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం సమస్యలు ఎదుర్కొంటున్న పత్రికల చేతుల్లోనే ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

No comments: