Monday, September 22, 2008

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కుంభకోణం!

దీక్షకు సిద్ధపడిన ఎస్.డి.వి. శేఖర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే సంఘం పెద్దలు బహిరంగంగా ప్రకటన చేయవచ్చు. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఇప్పటివరకు జరిగిన వ్యవహారాన్ని సభ్యులకు తెలియజేసి మద్దతు కూడగట్టవచ్చు. కానీ సంఘం పెద్దలు అవేమీ చేయడం లేదంటే అనుమానాలు బలపడక ఏం చేస్తాయ్.
శేఖర్ పేరుకే పిచ్చివాడు కానీ వాడు చేస్తున్న వాదన పిచ్చిది కాదుకదా? అప్పులు చేసి డబ్బులు కట్టినవాళ్ల పరిస్థితి ఏమిటి? సంఘంలోని కొంతమంది నాయకులలా మిగతా వారు అడ్డదారుల్లో ౩.౩౦ లక్షల రూపాయలు కట్టలేదన్న విషయం వీరికి తెలియంది కాదు కాబట్టి వ్యవహారాన్ని త్వరగా తేలిస్తే మంచిది. కేబినెట్లో చర్చకు రానంత మాత్రాన మనకు జిల్లా కలెక్టర్ అడ్వాన్సు పొజిషన్ ఇచ్చిన స్థలం మనది కాకుండా పోదు కాబట్టి తక్షణం స్థలాన్ని పూర్తి మొత్తాన్ని కట్టిన వారికి తొలి ప్రాధాన్యతగా లాటరీ పద్దతిన పంపిణీ చేయడం మర్యాదదాయకం. లేకుంటే సంఘంపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది.
(పూర్తి వివరాలకు అప్డేట్ కోసం ఎదురుచూడండి.)

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి.జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.

విశాఖ కలెక్టరేట్లో కక్కుర్తి విలేఖర్లు

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు. కొంతమంది అధికారుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.
(తరువాయి అప్డేట్ కోసం వేచిచూడండి)

జర్నలిస్టుల జేబులు నింపిన వినాయకుడు!

వినాయకుడే విశాఖలో జర్నలిస్టులకు వేలకు వేలు ఇప్పించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఏ ఉద్దేశంతో ప్రచారాన్ని ఇంతలా నిర్వహించారో తెలియదు కానీ అయిదు పెద్ద పత్రికల విలేఖరులు మాత్రం తలో 10 వేల రూపాయలు వెనకేసుకున్నారు. దేవుడైనా ప్రచారానికి తప్పదు ముడుపులు!!!